రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. విద్యా కమిషన్ మాజీ ఛైర్మన్ ఆకునూరి మురళి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో అడ్డగోలు ఫీజుల వసూళ్లతో తల్లిదండ్రులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
టర్మ్ ఫీజులతో పాటు అడ్మిషన్ ఫీజులు, బిల్డింగ్ ఫండ్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు చేయడం తగదన్నారు. వెల్కమ్ డేలు, ఈవెంట్ల పేరుతోనూ వేల రూపాయలు గుంజుతున్నారని.. లక్షల రూపాయలు చెల్లిస్తున్నా నాణ్యమైన విద్య అందక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయుల అర్హతల పట్ల కూడా అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు.
నాన్-ప్రాఫిట్ సొసైటీల పేరుతో రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ.. అనుబంధ కంపెనీల ద్వారా విద్యను పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చేశారని ఆరోపించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో విద్య కార్పొరేట్ మయం అయిపోయిందని.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఏకంగా 750 కోట్ల రూపాయల విదేశీ ముసుగు బిజినెస్ జరిగిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆకునూరి మురళి ఉదాహరణలతో వివరించారు. బస్సులు, ల్యాబ్స్, లైబ్రరీలు, సెక్యూరిటీ వంటి సదుపాయాలు కల్పించిన మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు భారీ స్పందన వస్తోందని.. కేవలం వారంలోనే అడ్మిషన్లు 600 నుంచి 2,000కు పెరిగినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారంటే నమ్మకం పెరిగిందని స్పష్టం చేశారు.
కానీ, రాష్ట్రంలో విద్యకు తగినంత బడ్జెట్ కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 15 శాతం ఇస్తామని హామీ ఇచ్చినా.. ప్రస్తుతం కేవలం 8 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని, అందులోనూ 95 శాతం జీతాలకే సరిపోతోందని తెలిపారు. వియత్నాంలో 20 శాతానికి పైగా, కెనడాలోని ఒంటారియోలో 24 శాతం, చివరికి అఫ్గానిస్థాన్‌లోనూ 15 శాతం, కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీలో 30 శాతం వరకు బడ్జెట్ కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. కొఠారి కమిషన్ సిఫారసుల ప్రకారం విద్యకు కనీసం 18 నుంచి 20 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పెంచి.. విద్యను వ్యాపారంగా మార్చే విధానాలకు స్వస్తి పలకాలని ఆకునూరి మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
